ఐపీఎల్ ముందు అభిషేక్ శర్మ విధ్వంసం... 42 బంతుల్లో 94 పరుగులు!

  • ఐపీఎల్ 2026కు ముందు స‌న్‌రైజ‌ర్స్‌ ప్రాక్టీస్ మ్యాచ్
  • 42 బంతుల్లో 94 పరుగులతో అభిషేక్ శర్మ విధ్వంసం
  • 25 బంతుల్లో 72 రన్స్‌తో మెరిసిన కెప్టెన్ ఇషాన్ కిషన్
  • యువ హిట్టర్ సలీల్ అరోరా 16 బంతుల్లో 47 పరుగులు
  • ఐదు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చిన ఉనద్కత్
ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) స్టార్ బ్యాటర్, వరల్డ్ నెం.1 టీ20 ఆట‌గాడు అభిషేక్ శర్మ ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరిక పంపాడు. నిన్న‌ జరిగిన ఫ్రాంచైజీ అంతర్గత ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఈ యువ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు బాది విధ్వంసం సృష్టించాడు.

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో 21 బంతుల్లో 52 పరుగులతో మెరిసిన అభిషేక్, ఇప్పుడు అదే ఫామ్‌ను కొనసాగించాడు. ఎస్ఆర్‌హెచ్‌ 'ఏ' జట్టు తరఫున ఆడిన అతను జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 49), యువ పవర్ హిట్టర్ సలీల్ అరోరా (16 బంతుల్లో 47) కూడా మెరుపులు మెరిపించారు. వీరి ప్రదర్శనతో ఎస్ఆర్‌హెచ్‌ 'ఏ' జట్టు 21 ఓవర్లలో 9 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోరు చేసింది.  

రెండో ఇన్నింగ్స్‌లో ఎస్ఆర్‌హెచ్‌ 'బీ' జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లోనే 72 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ సీజన్‌లోని తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్న నేపథ్యంలో ఇషాన్ జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.

రూ.1.50 కోట్లకు అమ్ముడైన యువ వికెట్ కీపర్ సలీల్ అరోరా తన మెరుపు ఇన్నింగ్స్‌తో తుది జట్టులో స్థానం కోసం గట్టి పోటీ ఇస్తున్నాడు. బౌలింగ్‌లో వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ 48 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ నెల‌ 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో ఎస్ఆర్‌హెచ్‌ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.


Abhishek Sharma
IPL 2026
Sunrisers Hyderabad
SRH
Henrich Klassen
Saleel Arora
Ishan Kishan
Pat Cummins
Jaydev Unadkat
T20 World Cup

More Telugu News